బాలకృష్ణా! కాస్త డీసెన్సీ ప్లీజ్!

బాలకృష్ణ

ఫొటో సోర్స్, YT/Sithara Entertainments

  • రచయిత, బీబీసీ తెలుగు డెస్క్
  • హోదా,

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ సహనటి ఊర్వశి రౌతేలాతో ప్రవర్తించిన తీరు చాలామంది చూసే ఉంటారు.

ఇటీవల డాకూ మహారాజ్ సక్సెస్ సెలబ్రేషన్ ఫంక్షన్ జరిగింది. అక్కడ 'దబిడి దిబిడి' పాటను ఊర్వశి రౌతేలాతో కలిసి అభినయించారు బాలకృష్ణ. ఒట్టి సినిమా పాట అభినయమే అయితే కథ వేరే. అక్కడ చివర్లో ఒక జెశ్చర్ ఇచ్చారు. దాన్ని ఇక్కడ వివరించాలనుకోవడం లేదు.

ఆ దృశ్యాన్ని మీకు చూపించాలనుకోవడం లేదు. అది అసభ్యకరమైనది. చాలామంది మహిళా యాక్టివిస్టులు అది వెకిలితనం అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి అభ్యంతరకరమైన ప్రవర్తన బాలకృష్ణకు కొత్త కాదు. మహిళలను కించపరిచే వ్యాఖ్యలు, ప్రవర్తనతో ఆయన అనేకసార్లు వార్తల్లో నిలిచారు.

‘‘ఇది వెకిలితనం. పబ్లిక్‌గా ఇలాంటి జెశ్చర్స్ విమెన్ మోడెస్టీకి భంగకరం. ఇది చట్ట ప్రకారం కూడా నేరం. పైగా ఇది మొదటి ఘటన కాదు, రాధికా ఆప్టే దగ్గర నుంచి చాలా చాలా ఉదంతాలున్నాయి. పాత కాలపు భూస్వామ్య వ్యవస్థ తాలూకు పురుషాహంకారం ఇందులో ప్రతిఫలిస్తోంది. స్త్రీల పట్ల ఇలాంటి ప్రవర్తన ఎలాంటి సంకేతాలు పంపిస్తోందో ఇండస్ట్రీ ఆలోచించాలి’’ అని మహిళా యాక్టివిస్ట్, భూమిక పత్రిక, భూమిక కలెక్టివ్ నిర్వహిస్తున్న కొండవీటి సత్యవతి ఆగ్రహం వ్యక్తం చేసి ఉన్నారు.

ఈ ఉదంతంపై ‘బీబీసి తెలుగు’ బాలకృష్ణను సంప్రదించే ప్రయత్నం చేసింది. ఆయన పీఆర్ బృందాన్ని సంప్రదించింది. ఇంతవరకూ ఎలాంటి స్పందన రాలేదు. ఆయన స్పందిస్తే ఈ కథనంలో చేరుస్తాం.

తెలుగు సినిమాలో పాతుకుపోయి ఉన్న పురుషాధిపత్యానికి, డబ్బు, అధికారం కలగలిసిపోయి మహిళలను కించపరిచే ధోరణులకు బాలకృష్ణ ఒక ప్రతీక అనే విమర్శలు వినిపిస్తుంటాయి.

తెలుగు సినిమాల్లో కొన్ని కుటుంబాలకు చెందిన హీరోలు ఏం చేసినా చెల్లుతుందనే ధోరణి సాగుతోంది.

ఊర్వశి రౌతేలా

ఫొటో సోర్స్, YT/Sithara Entertainments

ఆధిపత్య ధోరణి

ఆయన సినిమాల్లో కంటి చూపుతో రైలు ఆగిపోయినట్టుగానే చిత్రవిచిత్రమైన ఉదంతాలు నిజ జీవితంలోనూ కనిపిస్తాయి.

ఆయన ఇంట్లో కాల్పుల కేసు పక్కనపెట్టినా బయట పబ్లిక్‌లో జరిగినవే అనేకం కనిపిస్తాయి.

ఆయన అభిమానిని కొడితే ఆ కొట్టించుకున్న మనిషి మా హీరో కొట్టడమే గొప్ప అనేసి మైకుముందుకొస్తారు.

హీరోయిన్ను నెట్టేస్తే.. 'అది అభిమానంగా నెట్టేయడం, ఆయనకు నాకు మంచి అనుబంధముంది. ఆయనంటే గౌరవం ఉంది' అని సహనటి అంజలి ముందుకొస్తారు. వేదిక మీదే మహిళల గురించి మాట్లాడుతూ మేము కడుపన్నా చేయాలి, ముద్దన్నా పెట్టాలి అని బహిరంగంగా అన్నా చెల్లిపోతుంది.

ఇది సినిమారంగంలో లోతుగా పాతుకుని పోయి ఉన్న ఆధిపత్య ధోరణిని సూచిస్తుంది. కొందరు హీరోయిన్లు పబ్లిక్ గా అవమానాల పాలయినా కూడా మాకే ఇబ్బంది లేదు అని చెప్పాల్సి రావడం కానీ లేదా మౌనంగా ఉండడం కానీ సినిమా రంగంలో ఊడలుదిగిన ఆధిపత్య భావనకు అద్దం పడుతుంది. అవకాశాలు కోల్పోతామేమోనని భయాలు, ట్రోలింగ్ భయాలు, అనుమానాలు, అవమానాలు, ఇంకెన్నో!

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
balakrishna

ఫొటో సోర్స్, UGC

సినిమా రంగంలో మహళలపై సాగే దోపిడీ, వివక్ష కొత్త విషయాలేమీ కావు. మహిళలు చాలా సందర్భాల్లో ఎందుకు మౌనంగా భరించాల్సి వస్తుందో మళయాళ ఇండస్ట్రీపై విచారణ జరిపిన హేమ కమిటీ రిపోర్ట్ వివరించి ఉంది. తీసుకోవాల్సిన చర్యలపై సిఫారసులు చేసింది.

బాలీవుడ్ కూడా దీనికి పూర్తి మినహాయింపేమీ కాదు. అన్ని చోట్లా ఏదో ఒక స్థాయిలో బలవంతులైన మగ సినిమా సెలబ్రిటీల చేతుల్లో వివక్షకు గురవుతున్నవారున్నారు. సినిమా రంగం మీద పట్టు సాధించిన కొందరు హీరోల ఆధిపత్యం మరీ పచ్చిగా వ్యక్తం అవుతోంది.

హేమ కమిటీ మాదిరే తెలుగు సినిమా రంగంపైన కూడా కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆ కమిటీ నివేదికలను ఏం చేశారో తెలీదు. సరైన చర్యలు తీసుకుని ఉంటే బాలకృష్ణ లాంటివారు ఇట్లా తమ సహనటులతో బిహేవ్ చేయగలిగి ఉండేవారా! మహిళలపై దోపిడీని వివక్షను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం అని పదే పదే చెప్పే తెలుగు ఇండస్ట్రీ అందరి విషయంలో తీసుకుంటున్నాం అని చెప్పగలదా! 'కడుపన్నా చేయాలి, ముద్దన్నా పెట్టాలి' అని బాలకృష్ణ అన్నపుడు ఏం చర్యలు తీసుకున్నారు?

ఊర్విశీ రౌతెలా

ఫొటో సోర్స్, X/UrvashiRautela

'కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలి'

''తెర మీద ఏమో కానీ నిజ జీవితంలో అలాంటి అసభ్యకరమైన చేష్టలు లైంగిక వేధింపుల చట్టం కిందకు వస్తాయి. ఇది ఆయనకు కొత్త కూడా కాదు. తెలుగు సినిమా రంగంలో సాధారణమైపోయిన ఇలాంటి అసభ్య ప్రవర్తన మొత్తం పనిస్థలాల సంస్కృతిని విషపూరితం చేస్తుంది. మహిళలతో ఇలా ప్రవర్తించొచ్చు, పర్లేదు అన్నట్టు ఇతరులను ప్రోత్సహిస్తుంది'' అని మహిళా యాక్టివిస్టు సునీత చెప్పారు.

''పని స్థలాల్లో మహిళల భద్రతకు సంబంధించి విశాఖ గైడ్ లైన్స్ తయారై 30 ఏళ్లు అవుతోంది. మళయాల సినిమా రంగంలో పురుషాధిక్యతను అక్కడ మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది. ఎన్నెన్ని రూపాల్లో మహిళానటులు దోపిడీకి వివక్షకు గురవుతున్నారో వివరంగా చెప్పింది. అనేకానేక సిఫారసులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం కూడా కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా ఆ లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీ రిపోర్ట్‌ను బయటపెట్టాలి. తెలుగు సినిమా రంగం ఆ నివేదిక సిఫారసులను అమలు చేయాలి'' అని సునీత అన్నారు.

తెలుగు సినిమా రంగంలో లైంగిక వేధింపుల నిరోధంపై ఏర్పాటైన కమిటీలో ఆమె సభ్యురాలిగా కూడా ఉన్నారు.

బాలకృష్ణ ఫ్యాన్ బేస్ ఉన్న మాస్ హీరో. అలాగే ఆంధ్ర అసెంబ్లీలో ఎమ్మెల్యే కూడా. సెలబ్రిటీలను అనేకమంది అనుసరిస్తూ అనుకరిస్తూ ఉంటారు.

బాలకృష్ణపై వెల్లువెత్తుతున్న విమర్శలు, సెలబ్రిటీల సామాజిక బాధ్యతకు సంబంధించి సమాజంలో కొనసాగుతున్న విస్తృతమైన చర్చలో భాగం. ఎంటర్ టైన్‌మెంట్ ఇండస్ట్రీలలో పాతుకుపోయి ఉన్న పెద్ద సమస్యను అది పట్టిస్తుంది.

బాలకృష్ణ

ఫొటో సోర్స్, YoutubeScreengrab

'మీ కుటుంబీకులకు జరిగితే'

బాలకృష్ణ అపుడెపుడో ఒక ఉదంతంలో అసెంబ్లీలో చెప్పీ చెప్పనట్టుగా క్షమాపణ లాంటిది చెప్పారు. కానీ సాధారణంగా చాలా సందర్భాలలో దులిపేసుకుని పోతుంటారు.

''ఇదే అసభ్యకరమైన జెశ్చర్ తమ కుటుంబ సభ్యుల పట్ల ఎవరైనా ప్రదర్శిస్తే వారెలా స్పందిస్తారో ఆలోచించుకోవాలి. వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడి సినిమాలో పనిచేసే చాలామంది మహిళలు అభద్రతను ఎదుర్కొంటారు కాబట్టి వారు నోరు విప్పలేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో సదరు వ్యక్తి పట్ల బహిరంగంగా గౌరవాభిమానాల్నే చాటుకోవాలసిన స్థితీ ఉండొచ్చు. జుగుప్సాకరమైన ట్రోలింగ్‌తో పాటు అనేకానేక ఇబ్బందులు పొంచి ఉంటాయి. ఈ స్థితిగతులను ఇటీవలి హేమ కమిటీ రిపోర్ట్ కూడా తేటతెల్లం చేసింది. ఏ మాత్రం నోరు విప్పినా వారి వృత్తి పరమైన అవకాశాలను దెబ్బతీయడానికి బలమైన లాబీలు పనిచేస్తూ ఉంటాయి. ఈ వాతావరణం మారాల్సి ఉంది. అడ్డూ అదుపూ లేని ఈ పురుషాహంకార వాతావరణాన్ని అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంది'' అని విమెన్ యాక్టివిస్ట్ సామాజిక వ్యాఖ్యాత సజయ చెబుతున్నారు.

మీటూ ఉద్యమం హాలీవుడ్‌ని కుదిపేసింది. అలాగే హేమకమిటీ రిపోర్ట్ కొంత చర్చను లేవదీయగలిగింది. కానీ తర్వాత షరా మామూలే.

అవ్వన్నీ పాతుకుపోయి ఉన్న పురుషాధిక్యతను పునాదుల్లోకి వెళ్లి కదిలించలేకపోయాయి. అడ్డూ ఆపూలేని ఆధిపత్యం చెలాయిస్తున్న వారి అసభ్య చేష్టలు కొనసాగుతూనే ఉన్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,  ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)